anantapur: ఉమ్మడి అనంతపురంను వరదలు ముంచెత్తాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అనంతపురం లోని పండుమేరు పొంగడంతో అనంతపురం జిల్లాను వరదలు చుట్టుముట్టాయి. బుడమేరు విజయవాడను ఎలా ముంచెత్తిందో, అదేవిధంగా పండమేరు కూడా అనంతపురంను వరదతో ముంచెత్తింది.
సోమవారం రాత్రి అనంతపురంలో కురిసిన భారీ వర్షాలకు పండమేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగుకు చుట్టుపక్కల ఉన్న కాలనీలోకి పూర్తిగా వరద నీరు చేరింది. వరద నీరు అంతకంతకు పెరుగుతుండడంతో ప్రజలు ఇళ్ల పైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పండమేరు పొంగడంతో ఉప్పరపల్లి పంచాయతీలోని జగనన్న కాలనీ నీట మునిగింది.
కనగానపల్లి వద్ద చెరువు గట్టు తగలడంతో… పండమేరులోకి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో హైదరాబాద్ – బెంగళూరు జాతీయ రహదారి 44పై రాకపోకలు నిలిచిపోయాయి. కనగానపల్లి మండలంలోని ముక్తాపురం చెరువు అలుగు పారడంతో జాతీయ రహదారిపైకి వర్షపు నీరు చేరింది. దీంతో వాహనాలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు పుట్టపర్తి వద్ద చిత్రావతి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
అనంతపురంలో గత కొన్ని గంటల్లో 125 మిమీ వరకు వర్షపాతం నమోదైంది. ఉమ్మడి అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా 100 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. దక్షిణ రాయలసీమ మరియు బెంగళూరు ప్రాంతాల్లో అక్టోబర్ 25 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కొనసాగే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.